జర్నలిస్ట్,అతని సోదరునిపై దాడి చేసి గాయపరచిన
ఎస్ఐ పై కేసు నమోదు చేసిన
జాతీయ మానవ హక్కుల కమిషన్
మహబూబాబాద్ జిల్లా : అకారణంగా ఒక పత్రిక విలేకరి, అతని సోదరుడిపై దాడి చేసి చేతులు విరగ్గొట్టిన నర్సింహులపేట ఎస్.ఐ గండ్రాతి సతీష్ పై ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎట్టకేలకు కేసు నమోదు చేసింది.
నర్సింహులపేట మండలం నర్సింహపురం (బంజార) గ్రామానికి చెందిన మేకరబోయిన నాగేశ్వర్ అయన తమ్ముడు ఈ నెల 4 న ఆన్లైన్ ద్వారా ఢిల్లీలోని కమిషన్ కు ఫిర్యాదు చేయగా ఈ మేరకు కేసు నెం. 316/36/5/2024 ను జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. గత నెల 15 తేది రాత్రి ఎస్ఐ దాడి చేసి గాయపరిచి వారి మీదే అక్రమ కేసు పెట్టాడని బాధితులు మేకరబోయిన నాగేశ్వర్, మేకరబోయిన బ్రమ్మేశ్ లు హక్కుల సంఘంకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విషయాలు పరిశీంచి మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎస్ఐ గండ్రాతి సతీష్ పై జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లు తమకు సమాచారం వచ్చినట్లు బాధితులు తెలిపారు. రాష్ట్ర డిజిపి, జిల్లా ఎస్పీకి ఈ మేరకు సమాచారం ఇచ్చారు.
ఎస్ఐ పై పోలీస్ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలి
నర్సింహులపేట ఎస్ఐ గండ్రాతి సతీష్ ఒక జర్నలిస్ట్, అతని సోదరుడిపై దాడి చేసి సుమారు 32 రోజులు అయినా ఎలాంటి చర్యలు పోలీస్ శాఖ చేపట్టకపోవడoపై తెలంగాణ ప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి. వై. గిరి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నిందితుడు అయిన ఎస్ఐ పై పోలీస్ కేసు నమోదు చేసి విచారణ జరిపి విధుల నుండి సస్పెండ్ చేసి బాధితులకు రూ. 10 లక్షలు నష్ట పరిహారం ఇచ్చి, పెట్టిన ఆక్రమ కేసును విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మానవ హక్కులను కాలరాసిన ఎస్ఐ పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఇప్పటికే రాష్ట్ర, జిల్లా పోలీసులను కోరామని .డి వై. గిరి తెలిపారు.