మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆభరణాలు దేవాదాయ శాఖ కు అప్పగింత

నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్ 


నర్సీపట్నంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న మరిడమ్మ వారి నగల వివాదం ఓ కొలిక్కి వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఉత్సవ కమిటీ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు తన వద్ద ఉన్న అమ్మవారి నగలను దేవాదాయశాఖ అధికారులకు అప్పగించారు. ఉగాది రోజు మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అమ్మవారి నగలు తన సోదరుడు జమ్మీలు వద్ద ఉన్నాయని, పండుగ రోజున అమ్మవారికి నగలు అలంకరించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాహాటంగానే మాట్లాడిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన సన్యాసిపాత్రుడు నగలు తన వద్దే ఉన్నాయని, ఆలయాన్ని దేవాదాయ శాఖ తమ ఆధీనంలోకి తీసుకున్నందున నగలను దేవాలయశాఖ అధికారులకు అప్పగిస్తానని ప్రకటించారు.


శుక్రవారం ఉదయం ఆలయానికి వచ్చిన అధికారులు హుండీలను  స్వాధీనపరుచుకున్నారు. 2,53,000/- హుండీ ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో సన్యాసిపాత్రుడు తన వద్ద ఉన్న అమ్మవారి నగలను తీసుకువచ్చి అధికారులకు అప్పగించారు. వాటిని పూర్తిగా లెక్కించి వివరాలను పొందుపరిచారు. అన్నమాట ప్రకారం అమ్మవారి నగలను అధికారులకు అప్పగించానని, పండుగ రోజున అమ్మవారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనం ఇస్తారని, అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు సన్యాసిపాత్రుడు మీడియాతో అన్నారు. దేవాదాయశాఖ ఈవో గంగారావు మాట్లాడుతూ ఉత్సవ కమిటీ చైర్మన్ సన్యాసిపాత్రడు నుండి నగలు స్వీకరించామని తెలిపారు. అదేవిధంగా ఆలయాన్ని దేవాదాయ శాఖ తమ ఆధీనంలోకి  తీసుకుందని, గుడి వరకు అన్ని ఖర్చులు, అమ్మవారి ధూప దీప నైవేద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఆచారం ప్రకారం బయట జాతర ఎలా నిర్వహించుకున్నా, తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు.