అమరావతి టీవీ సెవెన్ న్యూస్
ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఎవరైనా తమకే నేరుగా అందించవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. సీఈవో కార్యాలయంలో ప్రతిరోజూ సాయంత్రం 4-5 గంటల మధ్య ఫిర్యాదులు, వినతులు స్వీకరిస్తామన్నారు. రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయొచ్చన్నారు. సెలవు రోజుల్లోనూ సీఈవో కార్యాయలం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.47.5 కోట్ల విలువైన నగదు, మద్యం, వెండి, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మీనా వెల్లడించారు. 5.13 లక్షల లీటర్ల మద్యం, పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడినట్లు చెప్పారు. ఎన్నికల్లో పంచేందుకు తీసుకెళ్తున్న ఉచితాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు మీనా వెల్లడించారు. సీజర్లకు సంబంధించి 4337 కేసులు, కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 247 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8,681 లైసెన్స్ కలగిన ఆయుధాలను ఆయా పోలీస్ స్టేషన్లలో జమ చేశారని మీనా పేర్కొన్నారు.