అనంతపురం టీవీ సెవెన్ న్యూస్
అక్రమ తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్)
పెద్దపప్పూరు మండల కేంద్రంలో ఇసుక రీచ్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఇసుక రీచ్ పై నిత్యం నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్) అధికారులు, పోలీసులను ఆదేశించారు. సోమవారం పెద్దపప్పూరు మండల కేంద్రంలోని పెన్నా నదిలో ఉన్న సర్వే నంబర్ 1లో ఇసుక రీచ్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సోమవారం మైన్స్, గ్రౌండ్ వాటర్ అధికారులు, తహసీల్దార్, పోలీసులు, జిల్లా శాండ్ కమిటీ మెంబర్లతో కలిసి ఇసుక రీచ్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక రీచ్ లలో ఎలాంటి అక్రమ తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు రాత్రికి కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని, చెక్ పోస్ట్ పాయింట్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలన్నారు. సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రీచ్ లో ఇసుక నాణ్యత ఎలా ఉంది, ఇక్కడ ఎంత క్వాంటిటీ ఉంది,
ఇక్కడ ఎవరైనా అక్రమ తవ్వకాలు చేస్తున్నారా అంటూ పలు వివరాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దపప్పూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తే జరిమానా విధించడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, వాహనాలను సీజ్ చేయడం చేయాలన్నారు. ఇప్పటిదాకా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎలాంటి చర్యలు తీసుకున్నారు తదితర వివరాలపై రిపోర్ట్ అందించాలన్నారు
.ఈ కార్యక్రమంలో మైన్స్ డిడి నాగయ్య, సెబ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ్, గ్రౌండ్ వాటర్ డిడి తిప్పేస్వామి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కిషోర్ రెడ్డి, మైన్స్ ఎజి ఆదినారాయణ, తహసిల్దార్ రాజశేఖర్, ఏఎస్ఐ మహాదేవ్, ఆర్ఐ రామాంజులురెడ్డి, జిల్లా శాండ్ కమిటీ మెంబర్లు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.