టీచర్ టూ... హోమ్ మినిస్టర్..

 పాయకరావుపేట టీవీ సెవెన్ న్యూస్


పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను 

హోం మంత్రి పదవి వరించింది.

వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోం మంత్రి పదవి దక్కగా.. చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే నియమించారు. 

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత.

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ.. పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి పదవిని కేటాయించిన చంద్రబాబు.. ఈసారి ఏకంగా హోంమంత్రిని చేశారు.

ఈ ఎన్నికల్లో టీడీపీ పాయకరావుపేట నుంచి మరోసారి వంగలపూడి అనితకు అవకాశం ఇచ్చింది. 

అధినేత నమ్మకాన్ని నిలబెడుతూ రికార్డు విక్టరీ కొట్టారు వంగలపూడి అనిత. స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులను కలుపుకుని వెళ్లి 2024 ఎన్నికల్లో పాయకరావు పేట అసెంబ్లీ స్థానం నుంచి 43,727 ఓట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించారు.

ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకోవటమే కాకుండా.. హోం మంత్రిగా నియమితులయ్యారు.

ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు వంగలపూడి అనిత. 2014కు ముందు టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనిత 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు.

2014 నుంచి 2019 వరకు పాయకరావుపేట ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 

2019 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆమెను.. పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు పంపింది. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయినా.. కూడా టీడీపీ కోసం వంగలపూడి అనిత పనిచేశారు. 

తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తూ వైసీపీ విధానాలను ఎండగడుతూ వచ్చారు. 

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు.