ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి.

  విశాఖపట్నం టీవీ సెవెన్ న్యూస్ 


అధికారులకు దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత

జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ 

  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 11వ తేదీన జిల్లాకు రానున్న నేపథ్యంలో ఆయన పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత జిల్లా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా  ముఖ్యమంత్రి విశాఖకు విచ్చేస్తున్నారని, ఆయన పర్యటన ఏర్పాట్లలో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు ఉండరాదని స్పష్టం చేశారు. కొందరు అధికారుల్లో నిర్లిప్తత ధోరణి కనిపిస్తుందని, దాన్ని విడనాడి స్వంత కార్యక్రమంలా భావించి పర్యటనను విజయ వంతం చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సీఎం సన్నాహక ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం మెడ్ టెక్ జోన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకబ్రత భాగ్చి, జాయింట్ పోలీస్ కమిషనర్ డా.కె.ఫక్కీరప్ప, జీవీఎంసి కమిషనర్ సీఎం. సాయికాంత్ వర్మలతో కలిసి జిల్లా అధికారులతో ఆమె సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ విశాఖపట్నం ప్రాంతమంటే సంతోషాలకు, ఆనందాలకు నిలయమని, ఇక్కడ మౌళిక వసతులు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ ప్రాంతమంటే ముఖ్యమంత్రికి చాలా ఇష్టమని, అందుకే దీనిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు గావించాలని, పటిష్ట భద్రతను ఏర్పాటుచేసి, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  భోగాపురం నుంచి 11వ తేదీ  మధ్యాహ్నం 1.45 గం.లకు స్టీల్ ప్లాంట్ లోని  మెడ్ టెక్ జోన్ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకుంటారన్నారు. మధ్యాహ్నం  2.30గం.ల నుంచి 3.30గం.ల వరకు 

సీఐఐ ఆధ్వర్యంలో జరిగే జాతీయ మండలి సదస్సు లో పాల్గొంటారని అన్నారు. 3.30గం.ల నుంచి 4.30గం.ల వరకు మెడ్ టెక్ ఉద్యోగులతో ముఖాముఖి అనంతరం అదే ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన రెండు మందుల తయారీ యూనిట్లను ప్రారంభిస్తారని తెలిపారు. తదుపరి ఎయిర్ పోర్ట్ కు చేరుకొని, సాయంత్రం 5.00గం.ల నుంచి 6.00గం.ల వరకు ఎయిర్ పోర్ట్ లాంజ్ లో విశాఖలో మౌళిక వసతుల కల్పనలో భాగంగా మెట్రో రైలు, ఎన్.హెచ్.ఏ.ఐ, విఎంఆర్డిఏ, జీవీఎంసి, తదితర విభాగాలు, జిల్లా అధికారులతో సమీక్షించి,  విజయవాడకు బయలుదేరి వెళ్తారని కలెక్టర్ హోమ్ శాఖ మంత్రికి వివరించారు. జిల్లా అధికారులందరూ వారికి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు ఉండరాదని, పర్యటన చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 


ఈ సమావేశంలో జీవీఎంసి అదనపు కమిషనర్ కె.ఎస్. విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్,  జిల్లా రెవిన్యూ అధికారి కె.మోహన్ కుమార్,రెవిన్యూ డివిజనల్ అధికారులు డి.హుస్సేన్ సాహెబ్, ఎస్.భాస్కర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వరరావు,ఆర్ అండ్ బి, ఈపిడిసిఎల్ పర్యవేక్షక ఇంజినీర్లు కె.కాంతిమతి, ఎల్. మహేంద్రనాథ్, జెడ్పీ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఎం.పోలినాయుడు, ఇతర జిల్లా, పోలీస్ అధికారులు, మెడ్ టెక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు