నాతవరం టీవీ సెవెన్ న్యూస్
భారీ వర్షాల కారణంగా తాండవ రిజర్వాయర్‌లో వరద నీరు పెరిగిందని తెలుసుకున్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి తనయుడు చింతకాయల రాజేష్ తాండవ రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా తాండవ రిజర్వాయర్ డీఈ అనురాధను ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
డీఈ అనురాధ అందించిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం 3 గంటలకు రిజర్వాయర్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి 7,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 380 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం ప్రమాదకర స్థాయైన 379.40 అడుగులకు చేరుకుంది.
ఇప్పటికే నాలుగు గేట్లు ఎత్తి దిగువకు 8,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. నీరు ప్రవహించే మార్గంలో గెడ్డలు కరగడం వల్ల తాండవ నది మరింత వేగంగా ప్రవహిస్తోందని, దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే, ప్రస్తుతం ఎటువంటి తీవ్రమైన ప్రమాదం లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్శనలో చింతకాయల రాజేష్‌తో పాటు నాతవరం మండల అధ్యక్షుడు నందిపల్లి రమణ, నాతవరం మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.