మహాశివరాత్రి కి బలిఘట్టం స్నాన ఘటాల వద్ద భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించిన స్పీకర్ అయ్యన్న

నర్సీపట్నం టీవీ సెవెన్ న్యూస్


ఫిబ్రవరి 26 మహాశివరాత్రి సందర్భంగా బలిఘట్టం ప్రాంతంలోని స్నాన ఘట్టాలు మరియు పరిసరాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు  సందర్శించారు. 26, 27, 28 తేదీల్లో నర్సీపట్నం పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు స్నానమాచరించడానికి వచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని, పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని పట్టణ సీఐ గోవిందరావుకు సూచించారు.


ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు  మీడియాతో మాట్లాడుతూ, మహాశివరాత్రి హిందువులకు పవిత్రమైన రోజు అని పేర్కొన్నారు. నర్సీపట్నం ఉత్తర వాహినిని "దక్షిణ కాశీ"గా పిలవడం జరుగుతుందని, పూర్వం నుండి పెద్దలు ఇక్కడ స్నానం చేసి, శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు.

2018లో భక్తుల సౌకర్యార్థం స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశామని, గంగా హారతిని కూడా ప్రారంభించామని గుర్తు చేశారు. గతంలో లాగే, ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం గంగా హారతి నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఫిబ్రవరి 27న ఉదయం అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే, పాకలపాడు గురువుగారి ఆశ్రమం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తిశ్రద్ధలతో స్నానం చేసి, పరమశివుడి కృపాకటాక్షాలను పొందాలని ఆయన ఆకాంక్షించారు.

ఈసందర్భంగా బ్రహ్మ లింగేశ్వర స్వామి స్థల పురాణం వీడియోను విడుదల చేశారు.

 ఈకార్యక్రమంలో కౌన్సిలర్ చింతకాయల రాజేష్, తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ,  కౌన్సిలర్ ధనమిరెడ్డి మధు, జనసేన ఇన్‌చార్జ్ రాజన వీర సూర్య చంద్ర తదితరులు పాల్గొన్నారు.